భారత రాజ్యాంగంపై అందరికి పూర్తిగా అవగాహన ఉండాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం చందాసత్రంలో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో పుట్టా సురేంద్రబాబు, వెన్నపూస బ్రహ్మరెడ్డి, విజయవిహారం రమణమూర్తి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం పాటుపడుతున్నామ న్నారు. దీనిలో భాగంగా భారత రాజ్యాంగంపై గ్రామ సభలు, సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు.. ఉచితంగా అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మందికి పైగా సభ్యులు అధ్యయన శిక్షణ తరగతులు పూర్తిచేసుకున్నారని చెప్పారు. 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకునే విధంగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవగాహన ద్వారానే అది సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్క రూ తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలన్నారు.