రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి రాజధానులుగా తయారుకావాలని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ ఆకాక్షించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..... అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు. కొన్ని భవనాలు నిర్మించి, ఆఫీసులు ఏర్పాటు చేసినంత మాత్రాన ఏ ప్రాంతమూ అభివృద్ధికాదని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వేజోన్, ప్రత్యేకహోదా అమలు చేయాలన్నదే తన అభిప్రాయమన్నారు. ఈ అభిప్రాయాలు ఉన్న పార్టీలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ అంశాలను మేనిఫెస్టోలో చేర్చుతామని వచ్చిన పార్టీలతో చర్చిస్తానని లేకపోతే స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెప్పారు.