జగన్ సర్కారుపై ఉద్యోగుల సంఘాల సమరానికి ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమైంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 5 వరకు తొలిదశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను ప్రకటించింది. మరో అతిపెద్ద జేఏసీ కూడా కలసి రావాలని ఆహ్వానం పలికింది. ఈ మేరకు ఏపీ జేఏసీ కూడా త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ రెండు జేఏసీలు ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను ప్రకటించారు. కర్నూలులో నిర్వహించిన మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై 50 పేజీలతో కూడిన డిమాండ్లను ఫిబ్రవరి 13న సీఎ్‌సకు అందించినట్టు తెలిపారు. ఈ నెల 25 వరకు తమ డిమాండ్లపై స్పష్టత కోసం సమయం ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.