మనసు ఇచ్చిన ప్రేయసిని మర్చిపోలేక. కట్టుకున్న భార్యతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేక చివరకు మృత్యువును ఆశ్రయించిన యువకుడు. వెదురువాడ ఆర్అండ్ఆర్ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అచ్యుతాపురం సీఐ మురళీరావు తెలిపిన వివరాల ప్రకారం. విశాఖపట్నం ఉక్కునగరానికి చెందిన రుంజల కిరణ్‌బాబు (33) ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఉన్న ఓ ఆన్లైన్ పోర్టల్ గోదాంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. కుమారుడి ప్రేమ వ్యవహారం తెలియని తల్లిదండ్రులు జనవరి 26న మరో యువతితో వివాహం జరిపించారు. పెళ్లయినా ప్రియురాలిని మరువలేక పోవడంతో ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించాడు.
ఆమె అచ్యుతాపురం మండలం వెదురువాడలో బంధువుల ఇంటివద్ద ఉందని తెలుసుకొని సోమవారం రాత్రి ఇక్కడికి వచ్చాడు. పురుగు మందు తాగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రియురాలికి ఫోన్లో చెప్పాడు. వెంటనే ప్రియురాలు అక్కడకు వచ్చి కొన ఊపిరితో ఉన్న కిరణ్‌బాబును మొదట అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి. అక్కడ నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి బతికించడానికి ప్రయత్నించింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కిరణ్‌బాబు మృతిచెందాడు. కిరణ్ సోదరుడు చంద్రమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు