ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చు సినిమాలోలా...కానీ రియల్ లైఫ్ లో జరిగింది

national |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 12:27 AM

చచ్చాడని పిల్లోడిని పాడేస్తే అతడు పెద్దవాడై తిరిగొచ్చే సీన్లు మనం సినిమాల్లోనే చూస్తాం. కానీ నిజజీవితంలోనూ ఇలాంటి ఘటన దర్శనమిచ్చింది. 15 ఏళ్ల కిందట పదేళ్ల బాలుడికి పాము కాటు వేసింది. పాము కాటుతో మృతి చెందాడని భావించిన అతడు.. 15 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఇంటికి తిరిగొచ్చాడు. చనిపోయాడని భావించి అరటి బోదిలో చుట్టి నదిలో వదలిపెట్టిన తమ కుమారుడు తిరిగి రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. కుటుంబాన్ని ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసిన ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. బాలుడిగా ఉన్నప్పుడు చనిపోయిన అతడు మళ్లీ తిరిగి రావడంతో యువకుడ్ని చూసేందుకు ఊరంతా ఎగబడ్డారు.


దివరియా జిల్లా భాగల్పూర్ బ్లాక్ పరిధిలోని మురసో గ్రామానికి చెందిన రామ్ సుమర్ యాదవ్ కుమారుడు అంగేశ్ యాదవ్‌కు పదేళ్ల వయసులో పాము కాటు వేసింది. విషపూరిత పాము కాటు వేయడంతో నోటి వెంట నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంగేశ్‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా కుటుంబసభ్యులు భూతవైద్యం చేయించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అంగేశ్ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.


దీంతో తమ గ్రామ సంప్రదాయం ప్రకారం.. అంగేశ్ను ఓ అరటి కాండంలో చుట్టి.. సరయూ నదిలో వదిలిపెట్టారు. చనిపోయాడని భావించిన తమ కుమారుడు 15 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యింది. అసలు చనిపోయాడని నదిలో వదిలిపెట్టిన అతడు ఎలా బతికాడు అని వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అంగేశ్ వివరించాడు.


‘పాము కరిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.. స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచేసరికి బిహార్ రాజధాని పట్నా సమీపంలోని అమన్ మాలి అనే పాములను ఆడించే వ్యక్తి దగ్గర ఉన్నాను.. ఆయనే నన్ను బతికించి పెంచి పెద్ద చేశారు. పాములాడించే ఆయన వెంట చాలా ప్రాంతాలు తిరిగాను. కథిహారాలోలో కొద్ది రోజులు ఉన్నాను.. ఆ తరువాత అమన్తో కలిసి పంజాబ్లోని అమృత్సర్ వెళ్లాను.. అక్కడ కొన్ని రోజులు ఓ భూస్వామి దగ్గర పనిచేశాను’ అంగేశ్ తెలిపాడు.


అమృత్సర్లో ఉన్నప్పుడు తన గతం గురించి ఓ లారీ డ్రైవర్కు అంగేశ్ చెప్పడంతో అతడు ఉత్తర్ ప్రదేశ్లోని ఆజంగఢ్కు తన వెంట తీసుకువచ్చాడు. అక్కడ నుంచి బల్లియా జిల్లా బెల్థారా రోడ్డుకు చేరుకుని.. తన ఊరు గురించి, గుర్తున్న వ్యక్తుల పేర్లు గురించి చెప్పాడు. అందులోని ఒకరు అంగేశ్ ఫొటో తీసి మురసో గ్రామంలో తనకు తెలిసిన వారికి పంపించారు. మరోవైపు, అంగేశ్ కూడా తన కుటుంబాన్ని కలుసుకోడానికి మనియార్ పోలీసులను సంప్రదించి, తన గతం గురించి వివరించాడు.


చివరకు మనియార్ పోలీసుల అంగేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్టేషన్కు చేరుకున్న తల్లి కళావతి దేవి, పిన్ని శంభాలవతి దేవి, ఇతర కుటుంబ సభ్యులను అంగేశ్ గుర్తించాడు. తాను మీ కుమారుడ్ని అని నిరూపించుకునేందుకు.. గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితులు, తన పక్కింటిలో ఉండే వ్యక్తులు, చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లను చెప్పాడు. దీంతో అతడు అంగేశ్ అని నిర్ధారించిన పోలీసులు.. కుటుంబసభ్యులకు అప్పగించారు. తన స్నేహితులతో పాటు గ్రామంలోని వ్యక్తులందర్నీ అంగేశ్ గుర్తించాడని మురసో గ్రామ సర్పంచ్, ఆ ఊరు కాలేజీ ప్రిన్సిపాల్ సత్యేంద్ర యాదవ్‌ తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com