లౌకికవాదాన్ని మర్చిపోవద్దు అంటూ భాతర అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని పురాతన, సాంస్కృతిక, మతపరమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలకు వాటి అసలు పేర్లు పెట్టేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తయిన తర్వాత కూడా ఆక్రమణదారుల పేర్లు ఇంకా కొనసాగించడం దేశ సార్వభౌమాధికారం, ఇతర పౌర హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిల్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్ , జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశం గత చరిత్రకు బందీగా ఉండరాదని.. పాత సమస్యలను తిరగదోడి, దేశంలో అవి ఎప్పటికీ రగులుతూ ఉండేలా చేయడం తగదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. నగరాలు, పట్టణాలపై విదేశీ ఆక్రమణదారుల ముద్రలను తుడిచివేసి పురాతన గుర్తింపులతో తిరిగి నామకరణం చేయడానికి చేసిన ప్రయత్నాలు ప్రమాదకరమని హెచ్చరించింది.
‘మన దేశాన్ని విదేశీ శక్తులు ఆక్రమించి పాలించిన మాట వాస్తవమే.. చరిత్రలో ఇష్టంలేని భాగాన్ని తొలగిస్తామనడం సరికాదు.. మనది లౌకిక దేశం. హిందూయిజం అనేది ఒక జీవన విధానం.. ఇది ప్రతి ఒక్కరినీ తనలో ఇమిడిపోయేలా చేసుకుంది.. దానిలో ఎటువంటి మతవైరం లేదు. దేశ గత చరిత్ర ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడకూడదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీరు చరిత్రపై ఒక నిర్దిష్ట దృక్కోణాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? మరింత అసమానతను సృష్టించాలి అని పేర్కొంది.
‘మేము దండయాత్రలను కోరుకోం. కానీ ఈ విషయంలో ముందుకు వెళ్లి ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించలేం అని స్పష్టం చేసింది. ‘చారిత్రక వైపరీత్యాలు దేశంలోని వర్తమాన, భవిష్యత్ తరాలను వెంటాడకూడదు.. తరువాతి తరాలు బంధీలుగా మారుతారు.. లౌకికవాదం, వివిధ వర్గాల మధ్య సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని కాపాడే రాజ్యాంగ ప్రవేశిక దేశానికి అత్యంత ముఖ్యమైనది. ఇది ఒక్కటే జాతీయ ఐక్యత నిజమైన భావాలు, దేశాన్ని ఒకదానితో ఒకటి బంధిస్తుంది. మీరు గతానికి తిరిగి వెళ్లి, సమస్యను సజీవంగా ఉంచాలనుకుంటున్నారా? ఒక నిర్దిష్ట సంఘాన్ని చూపడం ద్వారా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారా? భారతదేశం సెక్యులర్ దేశమని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొంటూ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్ తాను క్రిస్టియన్ అయినా హిందూమతం అంటే నాకు చాలా ఇష్టమని అన్నారు.