గత కొంత కాలంగా గగన మార్గలో అమెరికా వర్సెస్ చైనా అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. తాజాగా దక్షిణ చైనా సముద్రం లో డ్రాగన్ దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల కిందట తమ నిఘా విమానాన్ని చైనా ఫైటర్ జెట్ వెంబడించినట్లు అమెరికా వెల్లడించింది. వివాదాస్పద పారసెల్ దీవులకు 30 మైళ్ల దూరంలో దక్షిణ చైనా సముద్రం మీదుగా 21,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న అమెరికా నేవీ జెట్ ను గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలున్న చైనా యుద్ధ విమానం వెంబడించిందని పేర్కొంది. ఈ సమయంలో తమ విమానానికి, చైనా జెట్‌కు మధ్య కేవలం కొన్ని వందల అడుగుల దూరం మాత్రమే ఉందని తెలిపింది.
నిఘా విమానం నడుపుతోన్న పైలట్లు.. చైనా యుద్ధం విమానం వైపు చూడగా.. దాని వెనుక భాగం రెక్కలపై ఉన్న ఎరుపు రంగు స్టార్ ఉందని, దానికి క్షిపణులు, ఆయుధాలు అమర్చి ఉన్నట్టు గుర్తించారని వివరించింది. పారసెల్ దీవుల సమీపానికి వచ్చేసరికి విమాన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఓ గొంతు వినిపించిందని.. చైనా విమానాశ్రయం నుంచి అది వెలువడిందని అమెరికా నేవీ తెలిపింది.
అమెరికా విమానం చైనా గగనతలానికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని.. ఆ ‘సమయంలో ఇక ముందుకు రావద్దు.. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే జరిగే దానికి మీదే బాధ్యత’ అని హెచ్చరికలు చేసినట్టు చెప్పింది. ఈ నిఘా విమానంలో ఉన్న సీఎన్ఎన్ మీడియా సిబ్బందికి కూడా ఆ రేడియో హెచ్చరిక స్పష్టంగా వినిపించింది. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఈ నిఘా విమానం ఎడమ రెక్కకు 500 వందల అడుగుల దూరంలో ఓ చైనా ఫైటర్ జెట్ ప్రత్యక్షమైనట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. రెండు సీట్లు కలిగిన రెండు ఇంజిన్ల పీఎల్ఏ యుద్ధ విమానం తమను వెంబడించినట్టు అమెరికా పైలట్ లెఫ్టినెంట్ నిక్కీ శ్లాటర్ చెప్పారు.
‘‘పీఎల్ఏ ఫైటర్ జెట్.. ఇది అమెరికా నేవీ పీ-8 ఏ … నేను ఎడమ రెక్కను నుంచి దూరంగా వెళ్లాను.. నేను పశ్చిమానికి వెళ్లాలనుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను అని చెప్పాను.. అవతలివైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. 15 నిమిషాల పాటు వెంబడించి తర్వాత వెనుదిరిగింది’’ అని నిక్కీ పేర్కొన్నారు. అయితే, అమెరికా నిఘా విమానాన్ని చైనా ఫైటర్ జెట్‌లు వెంబడించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలకు ఇది స్పష్టమైన సాక్ష్యం. ఆసియా పసిఫిక్‌లోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమెరికా నిఘా విమానాన్ని చైనా ఫైటర్ జెట్లు వెంబడించిన పారసెల్ దీవులు తమవంటే తమవేనంటూ చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూన్, తైవాన్‌లు అంటున్నాయి. ఈ ప్రాంతంలో అపార మత్స్య, చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండటమే అందుకు కారణం. అలాగే, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. 2016లో ప్రపంచ నౌకాయానంలో మూడో వంతు (3.4 ట్రిలియన్ డాలర్లు) దక్షిణ చైనా సముద్రం గుండా జరిగింది.