ఫిలిప్పీన్స్లో ఉల్లి సంక్షోభంతో అక్కడి జనాలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ పిసినారి వ్యక్తి.. కోడిని గాల్లో వేలాడగట్టి.. దాన్నే చికెన్ అని ఊహించుకుంటూ తినే అహనాపెళ్లంట సినిమాలోని ఈ సన్నివేశం చూస్తే నవ్వు ఆపుకోలేం. ఇది సినిమా.. కానీ, ఓ దేశంలో పరిస్థితి ఇలాగే ఉన్నా.. ఈ సీన్ కాస్త రివర్స్ అయింది. ప్లేట్లో చికెన్ పెట్టుకొని.. గాల్లో ఉల్లిపాయలు వేలాడదీసి వాసన చూసి తినేస్తున్నారు. 'మేం రోజూ ఉల్లి తినేంత రిచ్ కాదు' అని చలోక్తులు విసిరుకుంటున్నారు. ఇక, వివాహాలకు వెళ్తే కొత్త జంటలకు 'ఉల్లి బొకే' లను కానుకలుగా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఆ దేశంలో ఉల్లి ధరలు ఆస్థాయిలో పెరిగిపోయాయి మరి. ఫిలిప్పీన్స్‌లో ఉల్లి సంక్షోభం నెలకొంది.
ఆ దేశ రాజధాని మనీలా సూపర్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.1200 పలుకుతోంది. చికెన్, మటన్, పోర్క్ కంటే ఉల్లి ధరే ఘాటు ఎక్కువగా ఉంది. రెస్టారెంట్లు రెసిపీల నుంచి ఉల్లి మాయమైంది. ఇక సాధారణ ప్రజలు ఉల్లిని దాదాపుగా వాడకం పక్కనపెట్టేశారు. పిలిప్పీన్స్‌లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. నేపథ్యంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
క్యాండీ రోసా అనే 56 ఏళ్ల ఫిలిప్పీన్స్ మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను మార్కెట్కు వెళ్తే అక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు కనిపించాయి.. చిన్నపిల్లల పిడికిలి కంటే అవి చిన్నగా ఉన్నాయి. వాటిని ఒక్కోటి రూ.120కి అమ్ముతామని చెబుతున్నారు. అంత ధర పెట్టి మేం ఉల్లి కొనలేం.. అదే విషయం నా కుటుంబానికి వివరించా.. ఉల్లిపాయలు తినే బదులు జస్ట్ వాసన చూసుకోవాలని చెప్పా’’ అని వ్యాఖ్యానించారు.
డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఉల్లి రైతులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట ఎదగక ముందే వాటిని తవ్వి అమ్మకానికి తీసుకొస్తున్నారు. మరోవైపు, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. డిమాండ్కు సరిపడా సరఫరా ఉండేలా విదేశాల నుంచి 21వేల టన్నుల ఉల్లి దిగుమతికి పచ్చజెండా ఊపింది. పెద్ద ఎత్తున ఉల్లిని నిల్వ చేస్తున్న వ్యాపారుల గొడౌన్లపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు అధికారులు. అయినప్పటికీ, ఉల్లి రేటు మాత్రం ఆకాశం నుంచి దిగి రావడం లేదు.
ఏంజిలిస్ అనే రైతు మాట్లాడుతూ.. ‘ఇప్పుడు జరుగుతున్నది చారిత్రకం.. గతంలో ఎన్నడూ ఉల్లి ధరలు ఈ స్థాయిలో లేవు.. డిసెంబర్లో నేను ఉల్లి సాగు ప్రారంభించే సమయానికి కిలో రూ.380గా ఉండేది’ అన్నారు. సగం ఎదిగిన ఉల్లినే ఆ రైతు విక్రయిస్తున్నా.. వీటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక, ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు స్మగ్లర్లు.
ఇటీవల మధ్య ఆసియా నుంచి మనీలాకు వచ్చిన ఓ విమానంలో ఉల్లిపాయల బస్తాలను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని దేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ఒక్కో ఫిలిప్పీన్స్ పౌరుడు ఏడాదికి సగటున 2.34 కిలోల ఉల్లిని వినియోగిస్తారు. దేశీయ అవసరాలను తీర్చే స్థాయిలోనే అక్కడ ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కానీ, ఫిలిప్పీన్స్లో వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకేసారి ఉల్లి పంట సాగుకు అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల తర్వాతి సీజన్కు ముందే ఉల్లి నిల్వలు పడిపోయినట్లు తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, వ్యవసాయ మంత్రి ఫెర్డినాండ్ మార్కోస్.. ఉపాధిలో నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ఉందని అన్నారు. తమ వ్యవసాయ రంగం తీవ్రమైన సవాల్ ఎదుర్కొంటోందని ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ ఎకనమిక్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ జెనీ లాపినా అన్నారు.