మరోసారి ఖలీస్థాన్ వేర్పాటువాదం తెరపైకి వచ్చింది. రెండు రోజుల కిందట పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా అజ్‌నాలాలో ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్ సింగ్ అరెస్ట్‌తో వందల మంది పోలీస్‌స్టేషన్‌పై దూసుకొచ్చి దాడికి పాల్పడ్డారు. చివరికి పోలీసులు వెనక్కి తగ్గి లవ్‌ప్రీత్‌ను విడుదలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పంజాబ్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో తనను తాను భారతీయుడిగా భావించడం లేదని అమృత్‌పాల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏఎన్ఐ వార్తా సంస్థతో అతడు మాట్లాడుతూ.. ‘నన్ను నేను భారతీయ పౌరుడిగా భావించడంలేదు.. కేవలం ట్రావెల్ డాక్యుమెంట్‌గా ఉపయోగించే భారతీయ పాస్‌పోర్ట్ మాత్రమే ఉంది.. అది నన్ను భారతీయ పౌరుడిగా మార్చదు’ అని వ్యాఖ్యానించాడు.
‘లవ్‌ప్రీత్ అరెస్ట్, విడుదల భవిష్యత్ గమనాన్ని మారుస్తుంది.. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరగకుండా ఉండేది.. పోలీసులు తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా హడావిడిగా వ్యవహరించారు.. అధికారులు నాకు మద్దతు లేదని తప్పుడు సమాచారం ఇచ్చారు’ అని అమృతపాల్ చెప్పారు. మిలిటెన్సీని చాలా సహజమైన దృగ్విషయంగా అభివర్ణించిన అమృత్‌పాల్.. అహింసాయుత నిరసనను ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తే హింస తన నియంత్రణలో ఉండదని హెచ్చరించాడు.
‘మిలిటెన్సీ అనేది నేను ప్రారంభించగలిగేది కాదు.. మిలిటెన్సీని ఎవరూ ప్రారంభించలేరు లేదా అంతం చేయలేరు. మిలిటెన్సీ అనేది సహజమైన దృగ్విషయం. ఇది ఎక్కడైనా చాలా కాలం అణచివేత తర్వాత జరుగుతుంది.. మిలిటెన్సీ అనేది నిర్మాణాత్మకమైన విషయమా? మిలిటెన్సీని ప్రారంభించమని నేను ఎవరినీ ఆదేశించలేను, అది అలా జరగదు’అని అమృత్‌పాల్ చెప్పాడు.
ఇక, అనామకుడైన అమృత్‌పాల్ సింగ్ పేరు ఏడాది కిందటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, 12 నెలల్లోనే భారీగా మద్దతుదారులను సంపాదించుకొన్నాడు. 2022 ఫిబ్రవరి వరకు అమృత్‌పాల్ ఓ సాధారణ వ్యక్తి. సిక్కు సంప్రదాయాలను వదిలేసి కనీసం తలపాగా కూడా ధరించకుండా ఆధునిక జీవనశైలిని అనుసరిస్తుండేవాడు. తన బంధువుల ట్రావెల్ వ్యాపారంలో మద్దతుగా ఉండేందుకు దుబాయిలో ఉంటూ.. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు.
వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, నటుడు దీప్‌సిద్ధూ మరణంతో అతడి జీవితమే మారిపోయింది. సిద్ధూ అనుచరులకు దిశనిర్దేశనం చేసేవారు కరవైపోయారు. దీనిని అమృత్‌పాల్ తెలివిగా వాడుకొన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు. తొలి రోజుల్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ మాత్రం పాపులర్ అయ్యాడు.