పార్టీలో చేరిన కొన్నాళ్లకే సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ను కీలక పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా మొత్తం ముగ్గురిని నామినేట్ చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖుష్బూ సుందర్‌తో పాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేశారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రేఖా శర్మ వ్యవహరిస్తున్నారు. ఆమె 2018 ఆగస్టులో ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.
తనను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేయడంపై ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు’ అని ఆమె ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో నారీశక్తిని పరిరక్షించేందుకు తన వంతుగా కష్టపడి పనిచేస్తానని ఆమె అన్నారు.
‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నా మొదటగా కల్పించబోయే అవగాహన కార్యక్రమం మహిళలను మాట్లాడమని కోరడమే. అప్పుడు మాత్రమే మనం పోరాడవచ్చు’ అని ఏఎన్‌ఐ ప్రతినిధితో మాట్లాడుతూ ఖుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నామినేట్ కావడం పట్ల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల హక్కుల కోసం నిరంతరం ఖుష్బూ చేసిన పోరాటానికి దక్కిన గౌరవం ఇది’ అని ఆయన కొనియాడారు. ఖుష్బూకు అభినందనలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు.