విశాఖపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద జాతీయ రహదారి-16 ని కలుపుతూ ప్రతిపాదిత 6 లేన్ల కోస్టల్ హైవే నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ప్రతినిధుల బృందం మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు.
విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి నిరుపేద విద్యార్దులకు ప్రైవేటు పాఠశాలల్లో 1 వ తరగతి అడ్మిషన్లో 25శాతం రిజర్వేషన్ కల్పించడం అత్యంత ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో మార్చి 3, 4 వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ప్రతి ఒక్కరూ హాజరై రాష్ట్ర ప్రగతి, అందాలను ఆస్వాదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆహ్వానించిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఏడాది వయసు గల బిడ్డకు గుండె మార్పిడి విజయవంతంగా నిర్వహించి తిరుపతి శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ వైద్యులు ఊపిరి పోశారని తెలిపారు.