ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి హెచ్ రాయుడు, సీఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రు. 50, వాణిజ్య సిలెండర్ రు. 350 పెంచడాన్ని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మరియు సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే, మరోవైపు గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణమన్నారు. 3 సంవత్సరాల క్రితం వరకు రు. 417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రు. 1155కు పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీ వేయడం రెండు సంవత్సరాల నుండి నిలిపివేసింది. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదన్నారు. వాణిజ్య సిలెండరు ఒక్కసారిగా రు. 350లు పెంచడం వల్ల స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఆర్ధిక మాంద్యం వలన చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుంది. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయం. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేశారు.