కడప జిల్లా, మదనపల్లె మండలంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండి, దుర్వాసన వస్తోంది. అయితే మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ వాటర్‌ఫాల్స్ సమీపంలోని ఓ బండపై యువకుడి మృతదేహం పడిఉండడాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో మృతుడు ఎవరన్నది తెలియడం లేదు. పైగా ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. యువకుడు వయస్సు 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి కాల్చేశారా? లేక ఇక్కడే హత్య చేసి కాల్చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తు న్నారు. ప్రేమ వ్యవహారమా? లేక ఆస్తివివాద గొడవలా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇటీవల కొందరు యువకులు వాటర్‌ఫాల్స్ సమీపంలో ఓ యువతి కోసం గొడవపడినట్లు సమాచారం. ఆ గొడవే హత్యకు దారి తీసి ఉంటుందా? అనే అనుమానం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. కాగా మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు వీలుకాకపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఘటన జరిగి వారం పదిరోజులై ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.