కృష్ణ జిల్లా, విస్సన్నపేట మండలంలోని పలు రేషన్ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా విజిలెన్స్ ఎస్పీ టి.కనకరాజు ఆదేశాలతో సీఐ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించామని విజిలెన్స్ ఎస్సై కె.నాగేశ్వరరావు పేర్కొన్నారు. షాపు నంబరు 1లో 59 క్వింటాళ్లు, షాపు నంబరు 5లో టన్ను, షాపు నంబరు 31లో 570 కిలోల అదనపు బియ్యాన్ని గుర్తించినట్లు చెప్పారు. మూడు షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడులు ఇంకా కొనసాగుతాయన్నారు. దాడుల విషయం తెలుసుకున్న డీలర్లు దుకాణాలను మూసివేసి పరారయ్యారు. మండలంలో 33 షాపుల్లో మూడింటిలోనే రెండు టన్నుల అదనపు బియ్యం బయట పడటం చర్చనీయాంశమైంది.