రాష్ట్ర విద్యుత్ వినియోగదారులు ట్రూఅప్ బాదుడుతో బేజారవుతున్నారు. ట్రూఅప్ సమానంగా కాకుండా విద్యుత్ వినియోగాన్ని బట్టి వేస్తుండడంతో.. ఒక్కో ఇంటిపై రూ.54 నుంచి రూ.155 వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ట్రూఅప్ చార్జీల కింద రెండు దఫాలుగా రూ.2,900 కోట్లు, రూ.3,802 కోట్లు భారం మోపేందుకు, ఇంధన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు 63 పైసలు దాకా వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్‌సీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో.. వరుసగా ట్రూఅప్ చార్జీలన్నింటినీ ఒకేసారి వసూలు చేసేస్తోంది. ఒక్కసారిగా భారీగా వచ్చిన బిల్లులు చూసిన వినియోగదారుల విస్తుబోతున్నారు. ఒక్కసారిగా ఈ అదనపు బాదుడేంటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.