అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చిలమత్తూరు ఎస్. ఐ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్. ఐ తో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు కాపు కాచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. లేపాక్షి మండలం ఉప్పరపల్లికి చెందిన సూర్యనారాయణ, చిలమత్తూరుకి చెందిన శ్రీనివాసులు రేషన్ బియ్యం సేకరించి మరవకొత్తపల్లి వద్ద ఉన్న ఒక వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టడంతో బుధవారం ఏపీ 02-వై. 4862 నంబరు గల ఐషర్ వాహనంలో బియ్యం తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. అనంతరం వ్యవసాయ షెడ్డులో తనిఖీలు నిర్వహించగా 130 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు ఎస్. ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ఐషర్ వాహనంతో పాటు బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు.