ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా, పల్నాడు డిఇఒ వెంకటప్పయ్య వ్యాఖ్యలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఆర్డిఒ కార్యాలయ వద్ద ధర్నా చేసి ఆర్డిఒ ఎం. శేషిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాకు సిపిఐ నాయకులు కె. రాంబాబు అధ్యక్షత వహించారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు గుంటూరు విజరుకుమార్, మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు హామీని నెరవేర్చని సిఎం ఇతర సమస్యలనూ విస్మరించారని అన్నారు. తమ హక్కుల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడుతుంటే వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం దారుణమని అన్నారు.