కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 13న నిర్వహించనున్న రథోత్సవానికి పటిష్ట పోలీసు భద్రత చర్యలు చేపట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలను తిలకించడానికి వచ్చే ప్రజలు, ప్రముఖులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు డీఎస్సీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 210 మంది సివిల్ పీసీలు, 90 ఏఆర్ పీసీలు, 100 మంది హోంగార్డులు, 20 మందితో కూడిన ఏపీఎస్పీ ప్లటూన్ బలగాలను నియమించినట్లు తెలిపారు. అదేరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో భక్తులు, ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, ప్రశాంతంగా రథోత్సవం ముగిసేందుకు కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.