నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలంలోని విరువూరులో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేయడంతో తొమ్మిదిమంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్ధులు కూడా ఉన్నారు. క్షతగాత్రులు సమీపంలోని ప్రకాశం జిల్లా పామూరు వైద్యశాలలకు పరుగులు తీయగా, మరికొందరు గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకొన్న కొంతమంది యువకులు మంగళవారం మూకుమ్మడిగా కుక్కలను వెంబడించి ఓ పిచ్చికుక్కను చంపేశారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఇటీవల ఓ ఉపాధ్యాయినిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్ధులు కోరుతున్నారు.