రూ.2.79లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్లో వాస్తవాలు లేవని అడిగితే తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమే అని అన్నారు. ఘనంగా కేటాయింపులు చూపుతూ ఖర్చు మాత్రం భూతద్దంలో వెతికినా కనిపంచని విధంగా ఉన్న గత బడ్జెట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. శస్త్ర చికిత్స విజయవంతం... రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్ను రూపొందించారని యెద్దేవా చేశారు. కమిషన్ల కోసమే సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్ల కేటాయింపులు చూపారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్నవే అని తెలిపారు. 6 లక్షలపై చిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గులేకుండా అసత్యాలు చెప్పారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.