నేడు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటిగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకో సమాధానం చెప్పాలని అలానే దానిపై సభలో చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అసలు సీఎం ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటంటూ టీడీపీ డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. పోలవరానికి ఎన్ని నిధులు తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.