ప్రభుత్వ స్కీమ్‌లలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించకుంటే ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు విజయాడ ధర్నాచౌక్‌లో శుక్రవారం మహాధర్నా చేపట్టారు. ఆశ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, సెకండ్ ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లపై అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జె.లలిత మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.శాంతి మాట్లాడుతూ అనేక రకాల యాప్‌లతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడాలన్నారు.