ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో టెన్త్‌ విద్యార్థిని అదృశ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 10:48 AM

విజయనగరం జిల్లా, రావివలస కేజీబీవీలో టెన్త్‌ చదువుతున్న విద్యార్థిని డి.ఉమామహేశ్వరి అదృశ్యమవడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, మరోవైపు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గరుగుబిల్లి మండలం పిట్టలమెట్టకు చెందిన విద్యార్థిని ఉమామహేశ్వరి ఆరో తరగతి నుంచి రావివలస కేజీబీవీలోనే చదువుతోంది. అయితే గురువారం ఉదయం నుంచి ఆ బాలిక కనిపించడం లేదు. దీంతో ప్రిన్సిపాల్‌ ఛాయాదేవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇంటర్‌ విద్యార్థినులతో కలిసి బయటికి వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. ఎక్కడకి వెళ్లినట్లు సమాచారం కూడా లేదు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు’. అని ప్రిన్సిపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.రాజేష్‌ తెలిపారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు 91211 09469 నెంబరుకు సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. ఇదిలా ఉండగా కేజీబీవీలో విద్యార్ధిని అదృశ్యంపై డీఈవో ఎస్‌డీవీ రమణ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కేజీబీవీని జిల్లా అదనపు బాలికా సంరక్షణ అధికారిణి కె.రోజారమణి పరిశీలించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.ఛాయాదేవి నుంచి సమాచారం సేకరించారు. గతంలో విద్యార్ధిని ప్రవర్తన సరిగ్గా లేదని అప్పట్లో కుటుంబ సభ్యులకు తెలియజేశామని, కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చామని కేజీబీవీ సిబ్బంది వివరించారు. కాగా పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాచ్‌మెన్‌ ఎన్‌.జ్యోతిని సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని బాలికా సంరక్షణ అధికారిణి రోజారమణి తెలిపారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తగు చర్యలు నిమిత్తం పూర్తిస్థాయి నివేదికలను కలెక్టర్‌, డీఈవోకు అందించనున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa