అభివృద్ధి చెందుతున్న నగరాల ఆర్థిక అవసరాలపై జీ-20 సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయి. జీ-20 వర్కింగ్ గ్రూపు తొలి సమావేశం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మంగళవారం మొదలైంది. దీనికి 14 సభ్య దేశాల నుంచి 57 మంది హాజరయ్యారు. మరో ఎనిమిది ఆతిథ్య దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఏడీబీ, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి మరో పదిమంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు మౌలిక వసతులు, ఆయా ప్రాజెక్టులకు నిధుల సమీకరణ అనే అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని చర్చించారు. ఈ సదస్సుకు కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ అధ్యక్షత వహించారు. రేపటి నగరాలను ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా ఎలా మార్చాలి?, నగరాల మౌలిక వసతులకు ఎవరి నుంచి ఫైనాన్స్ తీసుకోవాలి? ఫ్యూచర్ రెడీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా నిర్మించుకోవాలనే అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు ప్రసంగించారు. ఆర్థిక వనరుల సమీకరణలో అనుసరించాల్సిన విధానాలను మరికొందరు వివరించారు. దీనికి అనుబంధంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో 13మంది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ... డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని, అందుకు గణాంకాలు ముఖ్యమని స్పష్టం చేశారు. సమావేశాన్ని రాత్రి డిన్నర్‌తో ముగించారు. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.