సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్కు భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి 2:30 గంటల ప్రాంతంలో టాటా ఏస్ వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా భీమడోలు జంక్షన్ వద్ద సిబ్బంది గేటు వేశారు. అదే సమయంలో టాటాఏస్లో వచ్చిన కొందరు వాహనంతో గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. రైలు సమీపంలోకి రావడంతో వాహనాన్ని పట్టాలపై వదిలేసి పారిపోయారు. వాహనాన్ని ఢీకొనడంతో రైలు ఇంజన్ దెబ్బతిన్నది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని ఎక్స్ప్రెస్ ఇంజన్ను మార్చారు. అనంతరం రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్లింది.