ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరేళ్ల వయసులో నేనూ వేధింపులకు గురయ్య... మహిళా ఐఏఎస్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:08 PM

చిన్నతనంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రముఖులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి కుష్బూ, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌లు తాము ఏ విధంగా కన్న తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురయ్యారో బయటపెట్టారు. తాజాగా, కేరళకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి తనపై చిన్నప్పుడు జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల వయసున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని, చిన్నతనంలోనే ఎంతో మానసిక క్షోభకు గురైనట్టు పథనంతిట్టా జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు.


రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో చిన్నారులపై జరుగుతోన్న లైంగిక వేధింపుల అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న దివ్య ఎస్‌. అయ్యర్‌ మాట్లాడుతూ.. తనపై జరిగిన లైంగిక వేధింపులను స్వయంగా వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు తనను ఆప్యాయంగా పిలిచి, దుస్తులు విప్పుతుంటే బాధేసి భయంతో అక్కడ నుంచి పారిపోయానని తెలిపారు. ఈ సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతుతో దానిని నుంచి బయటపడగలిగానని దివ్య వివరించారు.


‘‘ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నన్ను ఆప్యాయంగా పిలవడంతో వారి వద్దకు వెళ్లాను. వాళ్లు ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు.. వాళ్లు నా ఒంటిపై ఉన్న బట్టలు విప్పినప్పుడు బాధగా అనిపించింది.. దీంతో భయపడి అక్కడ నుంచి పారిపోయాను.. ఈ సమయంలో మా తల్లిదండ్రుల తనకు ఇచ్చిన మానసిక, ఉద్వేగపూరిత సహకారంతో నేను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగాను.. ఆ తర్వాత వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశాను. కానీ, వారు నాకు కనిపించలేదు. వారి ముఖాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.. ఆరేళ్ల బాలిక ఆ సమయంలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోయింది’’ అని చిన్ననాటి ఆ చేదు జ్ఞాపకం గురించి దివ్య వివరించారు.


పిల్లలకు చిన్నవయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ దివ్య వివరించారు. పిల్లలు సీతాకోక చిలుకల్లా ఎగరాల్సిన వయసులో మానసిక క్షోభకు గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలాంటి దృశ్యాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com