కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పడు ప్రస్తుత ప్రధాని.. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో బలవంతంగా ఇరికించాలని సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన న్యూస్ 18 రైజింగ్ ఇండియా కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానంగా చెప్పారు.
‘‘యూపీయే హయాంలో బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ జీని ఇరికించాలని సీబీఐ నాపై ఒత్తిడి తీసుకువచ్చింది.. ఇంత కుట్రచేసినా బీజేపీ ఏ రోజూ దీనిపై నిరసనలు, ఆందోళనలు చేపట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించడంపై కూడా అమిత్ షా స్పందించారు. ‘కాంగ్రెస్ నాయకుడు... దోషిగా న్యాయస్థానం నిర్ధారించిన నేత మాత్రమే కాదు.. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాజకీయ నాయకుడు కూడా’ అని అన్నారు.
తీర్పు విషయంలో పైకోర్టుకు వెళ్లకుండా మోదీపై రాహుల్ గాంధీ నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారనీ షా ధ్వజమెత్తారు అన్నారు. ప్రధానిపై నిందలు వేసే బదులు తన కేసుపై పోరాడేందుకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని షా సూచించారు. కాంగ్రెస్ అపోహలను ప్రచారం చేస్తోందని, కోర్టు నిర్ణయిస్తే శిక్షపై స్టే విధించగలదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
‘తన నేరారోపణపై స్టే తీసుకోవడానికి ఆయన అప్పీల్ చేయలేదు.. ఇది ఎంత అహంకారం? మీకు అనుకూలంగా కావాలి.. మీరు ఎంపీగా కొనసాగాలనుకుంటున్నారు. కోర్టుకు కూడా వెళ్లరు.. ఇలాంటి దురహంకారం ఎందుకు’ అని షా ప్రశ్నించారు. యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, రషీద్ అల్వీ వంటి 17 మంది ప్రముఖ నాయకులు అనర్హులయ్యారని అన్నారు. ‘దోషిగా నిర్దారణ అయి రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన ప్రజాప్రతినిధి అనర్హడవుతాడని తీర్పు చెప్పింది.. అయినప్పటికీ, ఎవరూ నల్ల వస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేయలేదు ఎందుకంటే ఇది చట్టం’ అని పేర్కొన్నారు.
రాహుల్ గాందీ ప్రసంగాన్ని పూర్తిగా వింటే ఆయన కేవలం మోదీని మాత్రమే కాదు, మొత్తం ఓబీసీ సామాజిక వర్గాన్నే కించపరిచారని అమిత్ షా ఆరోపించారు. ‘చట్టం స్పష్టంగా ఉంది. ప్రతీకార రాజకీయాల ప్రశ్నే లేదు. ఇది తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు’ అని షా అన్నారు. బంగ్లాను ఖాళీ చేయమని రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసు గురించి అడిగిన ప్రశ్నకు.. శిక్ష అమలులోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పినప్పుడు ప్రత్యేక అనుకూలత ఎందుకు ఉండాలని షా ప్రశ్నించారు.
‘ఇది రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వక ప్రకటన.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకూడదనుకుంటే, అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.. క్షమాపణ చెప్పనివ్వండి’ అని షా అన్నారు. ‘ఈ పెద్దమనిషి మొదటి వ్యక్తి కాదు. ఈ నిబంధన వల్ల చాలా పెద్ద పదవులు, అనుభవం ఉన్న రాజకీయ నాయకులు తమ సభ్యత్వాన్ని కోల్పోయారు...లాలూజీని అనర్హులుగా ప్రకటించినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదని, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అనర్హుడైతే ప్రమాదంలో పడుతుందా.. ఇప్పుడు ఆయన మీదకి వచ్చింది కాబట్టి గాంధీ కుటుంబానికి ప్రత్యేక చట్టం చేయండి అంటున్నారు.. ఒక్క కుటుంబానికి ప్రత్యేక చట్టం ఉండాలా? అని ఈ దేశ ప్రజలను అడగాలనుకుంటున్నాను.. ఇది ఎలాంటి మనస్తత్వం? అయితే, వారు మోదీ, లోక్‌సభ స్పీకర్‌ను నిందించడం ప్రారంభిస్తారు’ అని షా అన్నారు.