ఫ్లై ఓవర్‌పై ఓ అంబులెన్స్ బీభత్సం చేసింది. బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత అంబులెన్స్ అదే వేగంతో డివైడర్‌ను దాటుకొని వెళ్లి, బోల్తా కొట్టి.. ఫ్లై ఓవర్ రెయిలింగ్ పైకెక్కి ప్రమాదకరంగా నిలిచిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడపడంతో ఈ బీభత్సం జరిగింది. రాజస్థాన్‌లోని కోటాలో గురువారం (మార్చి 30) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ తూలుతూ ఉన్నాడని, వాహనంపై అతడికి నియంత్రణ లేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళను మన్‌భార్ బాయ్‌గా గుర్తించారు. బుందీ జిల్లాకు చెందిన మన్భార్ బాయ్.. తన భర్త, కుమారుడు, అత్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వేగంగా వచ్చిన అంబులెన్స్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ దాటికి ఆమె అమాంతం ఎగిరిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో మరణించారు.
గుమన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్దీ ఛవానీ వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కొంత మంది తమ సెల్‌ఫోన్లలో బంధించారు. వాహనదారులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కాసేపటి తర్వాత అంబులెన్స్ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడు రెండు క్వార్టర్ల మద్యం మాత్రమే తాగాడని చెప్పడం కొసమెరుపు.