పంజాబ్ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తూ దాదాపు రెండు వారాలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. యూట్యూబ్ లైవ్‌లో మాట్లాడిన అతడు.. తాను పోలీసులకు లొంగిపోవడం లేదని, నేను దేశం విడిచి పారిపోయేంత పిరికివాడ్ని కాదని, అటువంటి భ్రమలు తొలగించుకోవాలని పేర్కొన్నాడు. సిక్కుల అత్యంత పవిత్ర సంస్థ అకల్ తఖ్త్ సూచనలతో అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు గురువారం మరో వీడియో విడుదల చేసి... లొంగిపోయే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడం గమనార్హం.
‘‘నేను పారిపోయాను.. అనుచరులను విడిచిపెట్టానని కొందరు అనుకుంటున్నారు.. ఆ భ్రమలను తొలగించుకోండి.. నేను చావుకు భయపడను.. నేను దేశం విడిచి పారిపోయే వ్యక్తిని కాదు.. నేనొక తిరుగుబాటుదారును.. తిరుగుబాటు అనేది కష్ట కాలం.. ఈ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాను.. నేను ప్రభుత్వానికి భయపడను.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని అమృత్‌పాల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన కుటుంబం ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలని అతడు సూచించాడు. అంతేకాదు, సిక్కుల సమస్యల పరిష్కారం కోసం ‘సర్‌బత్ ఖల్సా’ను ఏర్పాటు చేయాలని అకల్ తఖ్త్ జతేదార్‌ను కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, పంజాబ్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టడంలేదని అమృత్ పాల్ పేరుతో ఓ ఆడియో మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ తాజా వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.
పంజాబ్ పోలీసుల నుంచి మార్చి 18న త్రుటిలో తప్పించుకున్న అమృత్‌పాల్.. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. వేషాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయితే బుధవారం లొంగిపోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వెలువడినప్పటికీ, అనూహ్యంగా పంజాబ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పోలీసులకు తనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని అందులో ఆరోపించాడు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. అతడు దేశం వదిలిపారిపోకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
మరోవైపు, అకల్ తఖ్త్ అల్టిమేటమ్‌తో పంజాబ్ ప్రభుత్వం దిగి వచ్చింది. అమృత్‌పాల్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా అరెస్ట్ చేసిన 360 మందిలో 348 మంది గురువారం విడుదల చేసినట్టు భగవంత్ మాన్ సర్కారు తెలిపింది. మిగతా 12 మందిని త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది.