ప్రజాసమస్యల చర్చించాల్సిన వేదికపై ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన బుధవారంత్రిపుర శాసనసభలో చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిపుర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. బుధవారం బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. ఈ సమయంలో అసెంబ్లీలో కూర్చున్న బీజేపీ ఎమ్యెల్యే జాదబ్‌లాల్ దేబ్‌నాథ్ (55) పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో జాదబ్‌లాల్ తన ఒళ్లో ట్యాబ్ పెట్టుకొని అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టసభలో ప్రజాప్రతినిధి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన త్రిపుర బీజేపీ అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్య.. ఎమ్మెల్యే దేబ్‌నాథ్‌కు నోటీసు జారీచేసి వివరణ కోరుతామని తెలిపారు. అయితే, దీనిపై ఇంకా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అసెంబ్లీ స్పీకర్ విశ్వబంధు సేన్ వెల్లడించారు. ఎమ్మెల్యే జాదబ్‌లాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజాప్రతినిధులంతా బాధ్యాతయుతమైన వ్యక్తులని, వారి చర్యలు ఇతరులకు ముఖ్యంగా యువ తరాలకు చెడు ఉదాహరణగా ఉండకూడదని ప్రతిపక్ష నేత అనిమేశ్ దేబ్‌వర్మ అన్నారు. ఎమ్మెల్యేల ప్రతిష్ఠను దిగజార్చిన బీజేపీ సభ్యుడిపై స్పీకర్ కఠినచర్య తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఇక, గతంలో సీపీఎంలో ఉన్న జాదబ్‌లాల్ 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అసెంబ్లీ మాజీ స్పీకర్ రామేంద్రచంద్ర దేబ్‌నాథ్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగ్‌బాసా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోవైపు, ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. సభలో ఫోన్లు పదే పదే రావడంతో మొబైల్ తీశానని, అశ్లీల వీడియోలు ఆటోమేటిక్‌గా వచ్చాయని సర్దిచెప్పుకోవడం గమనార్హం.
‘శాసనసభలో మొబైల్ ఫోన్ వాడకం నిషేధమని నాకు తెలుసు.. పదే పదే కాల్ రావడంతో ఫోను తీశా.. అంతే.. అశ్లీల వీడియోలు వాటంతట అవే వచ్చాయి..దీనిపై స్పీకర్, బీజేపీ అధ్యక్షుడ్ని కలిసి మాట్లాడుతాను.. తదుపరి చర్యలు తీసుకుంటాను’’ అని జాదబ్‌లాల్ మీడియాకు తెలిపారు. 2012లో కర్ణాటక అసెంబ్లీలోనూ ముగ్గురు బీజేపీ మంత్రులు అశ్లీల వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.