పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. దేశ చరిత్రలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రోల్ మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటే వైయస్ఆర్ గుర్తకొస్తారని, ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. పేదలు ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని, మీ గ్రామానికే, సమీపానికే అన్ని వైద్యసేవలు అందించే గొప్ప కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నారు. ఈ విధానంలో సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు.