ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేం సిద్ధమే,,,ఆదిమూలపు సురేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 06:16 PM

టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో సెల్ఫీ దిగిన టిడ్కో ఇళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకనే పూర్తి చేశామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి సురేష్ ప్రకటించారు. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు.


అయితే తండ్రీకొడుకులు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ టిడ్కో ఇళ్ల సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. చివరికి, తాజ్‌మహల్, చార్మినార్ ముందు కూడా చంద్రబాబు, లోకేష్‌లు సెల్ఫీలు తీసుకుని తామే కట్టామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం పోరాడుతోంది ఒక్క జగన్‌ మాత్రమే అని చెప్పారు.


ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను పేద ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై తెలుగు దేశం పార్టీ వేసిన రూ. 1,800 కోట్ల భారాన్ని వైసీపీ ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్‌- 2, ఫేజ్- 3 టిడ్కో ఇళ్లను అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.


మరోవైపు చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. సెల్ఫీలతో అబద్ధాలను ప్రచారం చేస్తూ తండ్రీకొడుకులు కాలం గడుపుతున్నారని ఫైరయ్యారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేశామని చెప్తున్న టీడీపీ నేతలు.. ఎన్ని పూర్తి చేశారో చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తవుతున్నాయని.. డిసెంబర్‌లోగా వీటిని ప్రజలకు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. టిడ్కో ఇంటిని రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ.. మహిళలకు ఇస్తున్న ఘనత సీఎం జగన్‌దన్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు అనుకూల మీడియాకు కనబడవు.. వినపడవని మంత్రి సురేష్‌ మండిపడ్డారు.


ఇదిలావుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఎన్ని అని ప్రశ్నించారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం ఇదేనంటూ చంద్రబాబు సెల్ఫీ దిగారు. తమ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఒక్క నెల్లూరులోనే వేలాది టిడ్కో ఇళ్లు కట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అవేనంటూ అక్కడ సెల్ఫీ దిగారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడుకు మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com