విశాఖలోని శ్రీహరిపురంలో పదిహేడేళ్ల యువతిపై హత్యాయత్నం జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీహరిపురం మెయిన్ రోడ్డులో శ్రీమంజునాథ్ మెడికల్ స్టోర్స్ వెనక ఓ రేకుల షెడ్డులో చిన్నపల్లి గౌరి అనే మహిళ కుమార్తెతో కలిసి ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక వీరుంటున్న రేకుల షెడ్డులోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి యువతి మెడను కత్తితో బలంగా కోయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కుమార్తె పరిస్థితి గురించి గౌరి చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో వారు 100కు డయల్ చేశారు. ఈ మేరకు మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో వున్న యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి మెడకు సుమారు పదమూడు కుట్లు పడినట్టు తెలిసింది. కాగా సంఘటన జరిగిన సమయంలో ఓ వ్యక్తి వచ్చి కాస్త హడావిడి చేసి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ నుంచి వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు యువతిని హతమార్చేందుకు ఎందుకు ప్రయత్నించాడో తెలియాలంటే ఆ ఆగంతకుడు పట్టుబడాలని పోలీసులు తెలిపారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.