గంజాయి కేసులో పట్టుబడి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు అతడ్ని చాకచక్యంగా చెన్నైలో పట్టుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం సీఐ శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. అనకాపల్లి ప్రాంతం లక్ష్మీపురానికి చెందిన సియాదుల సత్తిబాబు(27)ను లిక్విడ్ గంజాయి అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు.
శనివారం ఉదయం విధుల్లో ఉన్న స్టేషన్ సిబ్బంది కళ్లుగప్పి బేడీలతో సహా అతడు పరారైన విషయం తెలిసిందే. అలా పారిపోయిన అతడు కంచరపాలెం సమీపంలో బేడీలు తీయించుకొని కొండ మీదుగా రైల్వేస్టేషన్కు చేరుకొని కదులుతున్న రైలును ఎక్కేశాడు. తీరా అది చీపురుపల్లి మీదుగా వెళ్లడంతోఅక్కడ దిగి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లాలనుకున్నాడు. తన దగ్గర ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో వేరే వ్యక్తి సెల్ఫోన్ ద్వారా తన మిత్రుడికి ఫోన్ చేసి ఫోన్పెలో నగదు రప్పించుకున్నాడు.
విజయవాడ మీదుగా చెన్నైలో ఉన్న తల్లి దగ్గరకు చేరుకున్నాడు. తాను అక్కడికి నిందితుడితో సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది వస్తున్నట్టు ఫోన్లో సత్తిబాబు చెప్పిన విషయాన్ని అతడి భార్యకు తల్లి ముందుగానేసమాచారం అందించింది. సత్తిబాబు తప్పించుకున్న రోజు నుంచే నిందితుడి స్వగ్రామంలక్ష్మీపురంలో కాపుకాసిన ఓ మహిళా ఎస్. ఐ, సిబ్బందికి ఈ విషయం తెలిసి వెంటనేసత్తిబాబు మిత్రుడి సహాయంతో చెన్నై చేరుకుని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని విశాఖపట్నం తీసుకొచ్చారు. అతడు పథకం ప్రకారమే తప్పించుకున్నట్లు పోలీసులుచెబుతున్నారు. నిందితుడిపై ఎన్టీపీఎస్, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ను తోసి పారిపోయినందుకు గాను కేసులు నమోదు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. నిందితుడు పారిపోయిన ఘటన కారణంగా ఉన్నతాధికారులు తమపై చర్యలు తీసుకుంటారని ఆందోళన చెందిన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.