తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చలికాలం అయిపోయి వచ్చింది. చలి కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ.. చాలా మంది శీతాకాలపు దుస్తులైన స్వెటర్లు, శాలువాలు, రగ్గులు వంటి వాటిని అల్మారాల్లో ప్యాక్ చేసి స్టోర్ చేస్తున్నారు. అయితే, ఈ దుస్తుల్ని సరిగ్గా సిద్ధం చేయకుండా స్టోర్ చేస్తే.. వచ్చే శీతాకాలం వాడే సరికి వాటి నుంచి ముతక వాసన వస్తుంటుంది. లేదా వివిధ రకాల మరకలు, ఫంగస్ వంటి సమస్యలకు పరిస్థితులు దారితీయొచ్చు.
అంతేకాకుండా పసుపు మరకలు కూడా కనిపిస్తుంటారు. బూజు పట్టిన వాసన వస్తుంది లేదా కీటకాలతో ఉన్ని దుస్తులు దర్శనమిస్తాయి. నిల్వ చేయడానికి ముందు సరిగ్గా క్లీన్ చేయకపోవడం, ప్యాక్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అయితే, కొన్ని చిట్కాల్ని పాటిస్తే వచ్చే శీతాకాలంలో మీరు వాడాలనుకున్న సమయంలో కూడా ఉన్ని దుస్తులు తాజాగా ఉంటాయి.
శీతాకాలపు దుస్తులు ప్రత్యేకంగా ఉంటాయి
శీతాకాలపు దుస్తులు సాధారణ దుస్తులకు భిన్నంగా ఉంటాయి. వాటిలో ఉన్ని, మందమైన బట్టలు ఉంటాయి. ఇవి తేమను త్వరగా బంధిస్తాయి. కొద్దిపాటి ధూళి లేదా చెమట కూడా దీర్ఘకాలంలో మరకలకు కారణమవుతుంది. అందువల్ల, మీ దుస్తుల్ని నిల్వ చేసే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేయడం చాలా ముఖ్యం. సరిగ్గా నిల్వ చేసిన బట్టలు శుభ్రంగా ఉండటమే కాకుండా వాటి జీవితకాలం కూడా పెరుగుతుంది. కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చే శీతాకాలంలో కూడా వాటిని కొత్తగా కనిపించేలా చేయొచ్చు.
ఉతకడం, శుభ్రపర్చడం
మురికిగా ఉన్ని దుస్తులను ఉతకకుండా నిల్వ చేసే పొరపాటు ఎప్పుడూ చేయకండి. చెమట లేదా పెర్ఫ్యూమ్ మరకలు పాతబడినప్పుడు శాశ్వత గుర్తులుగా మారతాయి. అంతేకాకుండా చెమట, దుమ్ము కీటకాల్ని ఆకర్షిస్తాయి. ఇవి ఉన్ని దుస్తులను దెబ్బతీస్తాయి.
అందువల్ల, ఉన్ని దుస్తులను నిల్వ చేసే ముందు ఈజీ లేదా తేలికపాటి ద్రవ డిటర్జెంట్‌తో వాష్ చేయాలి. స్వెటర్లు, కోట్లు, శాలువాల్ని నిల్వ చేసే ముందు ఉతకాలి. ఇంట్లో ఉతకలేని దుస్తులను డ్రై క్లీనింగ్‌కు ఇవ్వాలి. మురికి బట్టలు నిల్వ చేయడం వల్ల కీటకాల బెడదకు దారితీయవచ్చు.
తడిగా ఉన్న ఉన్ని దుస్తుల్ని స్టోర్ చేయకండి
ఉన్ని దుస్తులను నిల్వ చేసేటప్పుడు తేమ లేకుండా చూసుకోండి. తడిగా ఉన్న దుస్తులు నిల్వ చేస్తే అవి దెబ్బతింటాయి. నిల్వ చేసే ముందు బట్టలు పూర్తిగా పొడిగా ఉన్నాయని నిర్ధారించుకోండి.కొంచెం తేమ ఉన్నా వాటిపై బూజు పెరిగి అవి దెబ్బతింటాయి. ఉన్ని దుస్తులు ఉతికిన తర్వాత వాటిని ఎండలో బాగా ఆరబెట్టండి.
కొంచెం తేమ కూడా ఫంగస్ పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఉన్ని దుస్తుల్ని పూర్తిగా ఎండబెట్టాలని నిర్ధారించుకోండి. బరువైన ఓవర్ కోట్లు లేదా లెదర్ కోట్స్‌ని మృదువైన బ్రిస్టల్స్ బ్రష్‌తో బ్రష్ చేయాలి. దీంతో పేరుకుపోయిన దుమ్మును తొలగించవచ్చు.
సరైన మడతలు, ప్యాకింగ్ ముఖ్యం
మందపాటి స్వెటర్లు, జాకెట్లను హ్యాంగర్లపై వేలాడదీయడానికి బదులుగా మడవండి. వాటిని ఎక్కువసేపు వేలాడదీయడం వల్ల వాటి ఆకారం చెడిపోతుంది. బట్టల్ని కాటన్ బ్యాగులు లేదా గాలి చొరబడని పెట్టెల్లో స్టోర్ చేయండి. ప్లాస్టిక్ సంచుల్ని నివారించండి. ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు తేమను బంధిస్తాయి.
ఈ చిట్కాలు ట్రై చేయండి
కీటకాల నుంచి రక్షించడానికి బట్టలపై నాఫ్తలీన్ బాల్స్ లేదా ఎండిన వేప ఆకుల్ని ఉంచండి. ఇది సహజమైన పద్ధతి. దుర్వాసనల్ని నివారించడానికి సాయపడుతుంది.
బట్టలు నిల్వ చేసే ముందు వార్డ్‌రోబ్ లేదా స్టోరేజ్ బాక్స్‌ను శుభ్రం చేసి ఆరబెట్టండి. లోపల దుమ్ము లేదా తేమ బట్టలను దెబ్బతీస్తుంది.
బట్టలు ఎక్కువ కాలం నిల్వ ఉంటే వాటిని అప్పడప్పుడు బయటకు తీసి గాలి బయటకు వెళ్లనివ్వండి. ఇది దుర్వాసన, తేమను నివారిస్తుంది. నిల్వ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఉన్ని దుస్తుల్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa