అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు శుక్రవారం అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి కీలక అంశాలపై స్పష్టతకు రానున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ఇరువురు నేతలు వాణిజ్య యుద్ధ విరమణకు తాత్కాలికంగా అంగీకరించారు. ఆ ఒప్పందాన్ని పొడిగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రపంచవ్యాప్త టారిఫ్ విధానాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం చర్చలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ పర్యటనపై చర్చలు జరుగుతున్నాయని చైనా విదేశాంగ శాఖ గతంలోనే తెలిపినప్పటికీ, వైట్‌హౌస్ ప్రకటించిన తేదీలపై చైనా నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. పర్యటనకు సంబంధించిన పూర్తి ఎజెండా, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa