రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రావడంలేదు, పంచాయతీలకు వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన లాగేస్తోందని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిరియంపల్లి సర్పంచ్ రావెళ్ళ సుధాకర్ తెలిపారు. వైసీపీకి చెందిన పగడాల రమేష్ మాట్లాడుతూ.... పంచాయతీలు, సర్పంచ్ల పట్ల సీఎం జగన్ తీరు సక్రమంగా లేదన్నారు. ఊళ్ళో మంచినీటి ట్యాంకు నిర్వహణకు నిధుల కోసం అనేకసార్లు అధికారులకు చెప్పినా నిధులు ఇవ్వటం లేదని పల్నాడుజిల్లా కోట సర్పంచ్ హఫీజ్బేగ్ వాపోయారు. మా నమ్మకం జగన్ నినాదాన్ని... మా అమ్మకం నువ్వే జగన్గా మార్చాలని వైసీపీ సర్పంచ్లు సూచించారు. చేసిన అప్పులు తీర్చడానికి సర్పంచులు అవయవాలు అమ్మాల్సిందేనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవయవాల అమ్మకానికి జగన్ సర్కారు అనుమతి ఇవ్వాలని కోరారు.