‘‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనారిటీలకు భద్రత లభించింది. అరాచకానికి అడ్డుకట్ట వేసి వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు లభించాయి’’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ మంగళగిరిలో తమ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని సీకే కల్యాణ మండపంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ‘‘తెలుగుదేశం ప్రభుత్వం రాక ముందు రాష్ట్రంలో మత కల్లోలాలు తీవ్రంగా ఉండేవి. హైదరాబాద్లో నెలల తరబడి కర్ఫ్యూ పెట్టేవారు. టీడీపీ ప్రభుత్వం వాటిని కఠినంగా అణచివేసి శాంతిని, మత సామరస్యాన్ని నెలకొల్పింది. దీనివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం లభించింది.