ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డినగర్ డివిజన్ శ్రీకృష్ణదే వరాయ నగర్ కాలనీలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో గురువారం నుంచి శనివారం వరకు స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వాగీశ కృపానిధి వేల్పూరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. పెరుమాళ్ల తిరుమంజనం, రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట వంటి ప్రత్యేక పూజలు కనులపండువగా నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.