కడప జిల్లా, పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లె పంచాయతీ అంగడివారిపల్లె లో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... మద్దయ్యగారిపల్లె పంచాయతీ అంగడి వారిపల్లెకు చెందిన ఉత్తన్న కుమారుడు మధు అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అంగళ్లులో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీ సాయంత్రం నుంచి అతను కనిపించలేదు. దీంతో స్నేహితులు కుటుంబీకులకు సమా చారం ఇవ్వడంతో పలుచోట్ల వెతకడంతోపాటు స్నేహితులు, బంధువులతో వాకాబు చేశారు. అయితే మధు ఆచూకీ చిక్కక పోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమం లో మంగళవారం కోల్డ్‌స్టోరేజీ వెనుక వైపు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలులేకుండా కుళ్లిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వైద్యులతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి సమీపంలో ఖననం చేశారు. ఈ మేరకు ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మధు..ఆనలైన బెట్టింగ్‌కు పాల్పడి అప్పులు కావడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.