మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపాలని నెల రోజుల ముందే ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో పథకం వేశామని ఈ హత్య కేసులో నాలుగో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి తెలిపాడు. సూదిమందుతో గానీ, గొడ్డలితో గానీ చంపాలని మొదట నిర్ణయించుకున్నామని చెప్పాడు. ‘2019 మార్చి 9, 10 తేదీల్లో చంపాలని ముందుగా అనుకున్నాం. మార్చి 14 రాత్రి చంపాలనుకోలేదు. ఆరోజు మధ్యాహ్నమే నిర్ణ యించుకుని రాత్రి హత్య చేశాం. ఇది తప్పని తెలుసుకుని నేను అప్రూవర్‌గా మారి జరిగిన విషయాలు సీబీఐ వాళ్లకు వివరించా’అని అన్నాడు. ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. వివేకాను నలుగురం కలిసి చంపుదామని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని.. డబ్బులు కూడా వస్తాయని తెలిపాడని తెలిపాడు. ‘ఎప్పుడు చంపాలనే విషయాన్ని ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే కూర్చుని పథకం వేశాం. ముందుగా అనుకున్నట్లు మార్చి 9, 10వ తేదీల్లో చంపాలని నిర్ణయించుకున్నప్పటికీ చంపలేదు. ఆయన్ను చంపాలనుకున్న మూడో రోజే వివేకా ఇంటి వద్ద ఉన్న కుక్కను చంపేశాం. ఆయనింటి చుట్టుపక్కలకు కొత్తవారు ఎవరు వెళ్లినా వెంబడిస్తోందని, ఇది ఉంటే హత్య చేసే సమయంలో డిస్టర్బ్ అవుతుందని కారుతో తొక్కించి చంపేశాం’ అని అన్నాడు.