చట్టాల విషయంలో అత్యంత కఠినంగా ఉండే సింగపూర్‌లో ఒక భారత సంతతి మహిళ ఆవేశం ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది. కేవలం 24 సింగపూర్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,500) టాక్సీ ఛార్జీ విషయంలో జరిగిన గొడవతో తీవ్ర కోపానికి గురైన సదరు మహిళ.. 73 ఏళ్ల వృద్ధ డ్రైవర్‌పై దాడి చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన స్థానిక న్యాయస్థానం నిందితురాలికి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన 36 ఏళ్ల షాలిని దేవరాజన్ అనే మహిళ ప్రస్తుతం సింగపూర్‌లో నివసిస్తోంది. అయితే 2025 నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె ఒక టాక్సీ ఎక్కింది. తన నివాసం ఉండే యిషూన్ ఎస్టేట్‌కు వెళ్లాలని డ్రైవర్‌కు సూచించింది. ప్రయాణ సమయంలో ఆమె పూర్తిగా మద్యం మత్తులో ఉండటంతో సీటులోనే నిద్రపోయింది. గమ్యస్థానానికి చేరుకున్నాక.. 73 ఏళ్ల వృద్ధ డ్రైవర్ ఆమెను నిద్రలేపి ఛార్జీ 24 డాలర్లు చెల్లించాలని కోరాడు. అక్కడే వివాదం మొదలైంది. తన వద్ద నగదు లేదని.. ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్లు కూడా ఏవీ పని చేయడం లేదని షాలిని చెప్పింది.
ఎలాగూ ఇంటికి వచ్చేశాం కాబట్టి.. ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకవస్తానంది. అయితే ఆమెపై నమ్మకం లేని డ్రైవర్ ఫోన్ తనకు ఇచ్చి వెళ్లాలని.. చెప్పాడు. అలా కుదరదంటే మీతోపాటే నేను కూడా పైకి వస్తానని డ్రైవర్ చెప్పాడు. ఈ రెండింటికీ ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇలా చాలా సేపటి వాగ్వాదం తర్వాత షాలిని.. దమ్ముంటే నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లు అంటూ డ్రైవర్‌కు సవాల్ విసిరింది. తన తప్పేమీ లేకపోయినా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తున్న మహిళకు బుద్ధి చెప్పాలనుకున్న డ్రైవర్ నేరుగా ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షాలిని.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆగ్రహంతో ఊగిపోయింది. అక్కడే డ్రైవర్ ఎడమ చెంపపై గట్టిగా కొట్టింది. ఈ దాడిలో వృద్ధుడికి తీవ్రమైన నొప్పి కలగడమే కాకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. వైద్యులు ఆయనకు ఒక రోజు మెడికల్ లీవ్ కూడా మంజూరు చేశారు. దీంతో ఆయన్ను ముందుగా పోలీసులను ఆశ్రయించారు. ఆపై కోర్టుకు కూడా వెళ్లారు. ఈక్రమంలోనే అక్కడి న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే ప్రాసిక్యూషన్ బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం 172 సింగపూర్ డాలర్ల పరిహారం కోరింది. అయితే తన వద్ద పైసా కూడా లేదని షాలిని కోర్టులో పేర్కొంది.
అంతేకాకుండా డ్రైవర్ ఛార్జీ అడిగిన సమయంలో తన జేబులో 50 డాలర్ల నోటు ఉన్న విషయం తనకు అప్పట్లో గుర్తు రాలేదని ఆమె వింత వాదన వినిపించింది. కావాలని తానేమీ గొడవ చేయలేదంటూ రచ్చ చేసింది. దీంతో న్యాయస్థానం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధులపై, ప్రజా రవాణా సిబ్బందిపై ఇలాంటి దాడులు సహించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆమెపై ఉద్దేశపూర్వకంగా గాయం కలిగించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. రెండు వారాల జైలు శిక్ష విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa