ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురిటి నొప్పులు భరించలేక.. గర్భిణి అసాధారణ నిర్ణయం.. తప్పిన ప్రాణాపాయం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:34 PM

ప్రతీ మహిళ బిడ్డకు జన్మను ఇచ్చే క్రమంలో పునర్జన్మ పొందుతుందంటారు. ఎందుకంటే ఆ ప్రసవవేదన, ఇతర సమస్యల వల్ల ఆమె బతుకుందో లేదో తెలియదు కాబట్టి ఇలా చెబుతుంటారు. కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆస్పత్రులు, మెరుగైన వైద్య చికిత్సల వల్ల ప్రసవంలో ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సుఖంగా జరిగిపోతున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే కాగా.. ఓ గర్భిణీ మహిళ మాత్రం ఆస్పత్రికి వెళ్లే వరకు కూడా పురిటి నొప్పులను భరించలేకపోయింది. దీంతో వంటింట్లో దొరికిన కత్తి తీసుకుని కడుపును కోసుకుంది. ఇంతటి భయానక పరిస్థితిలో కూడా ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.


ఒంటరితనం.. భరించలేని నొప్పులు


ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లా బౌండి పోలీస్ స్టేషన్ పరిధిలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల నంకై అనే మహిళ.. నిండు నెలల గర్భిణీ. అయితే సుమారు ఆరు నెలల క్రితమే ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూయడంతో.. గర్భవతిగా ఉన్న ఆమె ఒంటరిగా జీవించాల్సి వస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలు అయ్యాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, నొప్పుల తీవ్రత క్షణక్షణానికి పెరగడంతో ఆమె సహనం కోల్పోయింది. ఆ బాధను తట్టుకోలేక.. ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకుని తన పొత్తి కడుపును కోసుకుంది.


ప్రమాదకర స్థితిలో ఆసుపత్రికి..


దీంతో నొప్పి మరింత ఎక్కువ కావడంతో.. ఆ గర్భిణి భరించలేకపోయి, విపరీతంగా కేకలు వేసింది. పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించడంతో.. స్థానికులంతా ఆమె ఇంటికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలై ఉండటాన్ని చూసి అంబులెన్సుకు ఫోన్ చేశారు. ఆపై ఆమెను ఫఖర్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆరోగ్యకరమైన ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కత్తితో కోసుకోవడం వల్ల ఆమె పేగులు బయటకు రావడం, భారీగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది.


మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపు..


దీంతో ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆమె గాయాలను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆమె మధ్యాహ్నం 3.20 గంటలకు ఆసుపత్రికి వచ్చినప్పుడు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. కడుపుపై తీవ్రమైన లోతైన గాయం ఉంది. రక్తం చాలా వరకు పోయింది" అని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నోలోని ఉన్నత స్థాయి వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నంకై తల్లి నీతా ఆమె వెంట ఉండి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa