క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడి.. అంపైర్ మృతి చెందాడు. విషాదకర ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావోలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉన్నావో జిల్లా శుక్లాగంజ్ ప్రాంతంలోని అంబేద్కర్‌పురం రాహుల్ సప్రూ మైదానంలో అండర్-13 కిక్రెట్ మ్యాచ్ బుధవారం నిర్వహించారు. కాన్పుర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆట కొనసాగుతుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు మెరుపు దాడి చేశాయి. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, సిబ్బంది భయంతో తమను తాము రక్షించుకోడానికి పరుగులు తీశారు.
ఈ క్రమంలోనే అంపైర్‌గా వ్యవహరించిన మాణిక్ గుప్తా (65) తీనెటీగలు దాడిలో తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయనను చికిత్స కోసం కాన్పుర్ ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ దాడిలో మరో అంపైర్ జగదీశ్ శర్మ, 15 నుంచి 20 మంది క్రికెటర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనను క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సింగ్ ధ్రువీకరించారు. మృతుడి మాణిక్ గుప్తా కుటుంబానికి సంతాపం ప్రకటించారు. రెండో ఇన్నింగ్ మధ్యలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో తేనటీగలు దాడిచేయడంతో ఆటగాళ్లు అందరూ నేలపై పడుకోవాలని సూచించారు. ఇంతలోనే మాణిక్ గుప్తాను తేనెటీగలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే, పలువురు క్రికెటర్ల గాయపడ్డారు. ఈ ఘటనతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.
కాన్నూర్‌లో ఫీల్‌ఖానాకు చెందిన మాణిక్ గుప్తాకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. గురువారం ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. జిల్లాస్థాయి క్రికెటర్ అయిన గుప్తా.. పలు స్థానిక మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. బాధిత కుటుంబానికి కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సాయం అందజేశారు. డయాబెటిస్ బాధితుడైన గుప్తా.. హఠాత్తుగా తేనెటీగలు దాడిచేయడంతో భయాందోళనకు గురికావడం వల్లే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మిగతావాళ్లు వెంటనే కోలుకున్నారని చెప్పారు. ఈ ఘటన మాణిక్ గుప్తా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa