తమ వద్ద ఏడుగురు పాకిస్థాన్ సైనికులు బందీలుగా ఉన్నారంటూ వీడియోను విడుదల చేసిన బలూచీస్థాన్ వేర్పాటువాద గ్రూప్.. షేహబాజ్ షరీఫ్ ఫ్రభుత్వానికి వారం రోజులు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియోపై స్పందించిన పాకిస్థాన్.. వాళ్లు తమ సైనికులు కాదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. తమ ఐడీ కార్డులను, పత్రాలను వీడియోకు చూపించిన పాకిస్థానీ సైనికులు... తమను రక్షించాలని అధికారులను వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘మేము వారి సిబ్బంది కాదని ఆర్మీ ఎలా అంటోంది.. ఈ ఐడీ కార్డు ఎవరిది?’ అని సైనిక దుస్తుల్లో ఉన్న ఒకరు ప్రశ్నించారు.
‘‘ఇది పాకిస్తాన్ జారీచేసిన ఐడీ కార్డు.. మేము మీ సిబ్బంది కాదని చెప్పి మాకు అన్యాయం చేయకండి.. నా తండ్రి దివ్యాంగుడు.. మాపై దయ చూపిండి... మీ సైనికులం కాదని చెబుతున్న మీరు ఎందుకు మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు? అది ఫేక్ వీడియో అని ఎందుకు అంటున్నారు?’’ అతడు నిలదీశాడు. ఈ వారం ఓ వీడియోను విడుదల చేసిన బీఎల్ఏ .. ఖైదీల మార్పిడి ఒప్పందంపై పాక్ ప్రభుత్వానికి ఏడు రోజులు గడువు విధించింది. ఆలోగా స్పందించకుంటే.. తమ వద్ద బందీలుగా ఉన్న 8 మంది సైనికులు ప్రాణాలతో ఉండరని హెచ్చరించింది. బీఎల్ఏ విధించిన గడువు ఫిబ్రవరి 22తో ముగియనుండగా... పాక్ వాళ్లు తమ సైనికులు కాదని ప్రకటించింది. దీంతో పాక్ సైనికులు తమ ప్రాణాలకు ఆ దేవుడే దిక్కని వాపోతున్నారు.
ఆపరేషన్ హెరోఫ్ సెకెండ్ స్టేజ్ సమయంలో ఈ జవాన్లను బందీలుగా చేసుకున్నట్టు బీఎల్ఏ తెలిపింది. మొత్తం 17 మంది భద్రతా సిబ్బందిని తమ యోధులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. వీరిలో 10 మంది బలూచ్ జాతికి చెందిన స్థానిక పోలీసులని, అందుకే హెచ్చరించి వారిని విడిచిపెట్టినట్టు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, స్థానికత, తమ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ పది మందిని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం చేసింది.
పాకిస్తాన్ వైఖరి
బీఎల్ఏ వాదనలకు విరుద్ధంగా.. పాక్ ఆర్మీ అధికారులు తమ సిబ్బంది ఎవరూ అదృశ్యం కావడం లేదా రెబల్స్ అదుపులో లేరని ఖండించారు, అంతేకాదు, ఖైదీల మార్పిడి అవకాశాన్ని తోసిపుచ్చారు. కానీ, వారం రోజుల అల్టిమేటంలో కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, చర్చలు తక్షణమే ప్రారంభించాలని బీఎల్ఏ పునరుద్ఘాటించింది. ఆలోపు చర్చలు ప్రారంభించకపోతే, బందీలుగా ఉన్నవారికి ఉరిశిక్ష విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటి వరకూ పాకిస్థాన్ సైన్యం లేదా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాజా వీడియోపై అధికారంగా స్పందన తెలియజేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa