వాషింగ్ మెషిన్ల రాకతో దుస్తులు ఉతికే పని చాలా తేలికైంది. ఇళ్లలో గృహిణులు వాషింగ్ మెషీన్లను యథేచ్చగా వాడేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు చిన్న పొరపాట్లు కూడా భారీ నష్టానికి దారి తీయవచ్చు. స్పెయిన్‌లో ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్ బాంబులా పేలిపోయింది. గది క్షణాల్లో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
16 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి దుస్తులను బ్యాగ్‌లలో పెట్టుకుని లాండ్రీ నుంచి బయటకు వస్తుంటాడు. కొన్ని సెకన్ల తర్వాత, ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్ మూతలలో ఒకటి తెరుచుకుంటుంది. ఆ తర్వాత భారీ పేలుడు సంభవిస్తుంది. పేలుడు దాటికి గ్లాస్ ప్యానెల్ కుప్పకూలుతుంది. దుకాణం మొత్తం ధ్వంసమవుతుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తాయి.
ఓన్లీ బ్యాంగర్స్ పేరుగల ట్విటర్ ఖాతా నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఎవరో వారి పాకెట్స్ (జేబులు) తనిఖీ చేయలేదు’ అని కామెంట్ పెట్టారు. పేలుడుకు కారణం ఏమై ఉంటుందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దుస్తులను లాండ్రీ బ్యాగ్‌లలో ఉంచి, వాటిని వాషింగ్ మెషీన్‌కి మార్చే సందర్భాల్లో.. తరచుగా పాకెట్లను ఖాళీ చేయడం మరచిపోతుంటారు. కొన్నిసార్లు అది చాలా నష్టానికి దారి తీస్తుంది. పాకెట్లలో మండే వస్తువులు ఏవి ఉన్నా.. అది పేలుడుకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘ఈ రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా.. జేబులో ఉంచిన మండే వస్తువు కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండవచ్చు. వాషింగ్ మెషీన్లలో దుస్తులు వేసే ముందు.. పాకెట్ల నుంచి లైటర్లు, అగ్గిపెట్టెలు, ఏరోసోల్ డబ్బాలు లాంటి మండే వస్తువులను తీసేయ్యాలి. లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పేలుడుకు కారణం అవుతాయి’ అని ఓ నెటిజన్ హెచ్చరించారు. గ్యాస్ లీక్ లేదా అదనపు ఒత్తిడి కూడా పేలుడుకు కారణమై ఉండవచ్చునని మరి కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.