ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్న కార్యకర్తలే పునాది అని. అలాంటి కార్యకర్తలే భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి కొండంత అండ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజి లోని ఎస్బిఐటి ఆడిటోరియంలో నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తెలంగాణా తల్లి చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమరవీరుల మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.