శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస, బూర్జ మండలం రాజుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని, సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతికి రాజీనామా పత్రాలను పంపించారు. ఈ మేరకు ఆయన తన స్వగ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ గత 60ఏళ్లుగా మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. పార్టీలో మాకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో క్షీణించింది. ఇంత వేగంగా కోలుకొనే పరిస్థితి లేదు. ఈ పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయడం సాధ్యం కాదు. అందుకే కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు కాంగ్రెస్కు రాజీనామా చేశా. అందరితో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటా.’’ అని పీరుకట్ల తెలిపారు.