చంద్రబాబువన్నీ డ్రామాలేనని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పుప్పాల శ్రీనివాస్, అబ్బయ్య చౌదరి విమర్శించారు. నిన్న ఏలూరు జిల్లాలో చంద్రబాబు డ్రామా రక్తికటించారని ఎద్దేవా చేశారు. ఏలూరులో ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు ..ఆయనకు వాస్తవాలు మాట్లాడేఅలవాటు లేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లలో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించిందన్నారు.దెందలూరు, ఉంగటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించామన్నారు. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బులు కూడా చెల్లించామన్నారు. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో సాయం చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..ప్రతి గింజకు మద్దతు ధర ఇస్తుందని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలు, అపోహాలేనని, వారి మాటలు నమ్మవద్దని కోరారు.