అనకాపల్లి జిల్లాలో ఈనెల 7న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పర్యటించనున్నట్టు ఆ పార్టీ నాయకులు సుందరపు విజయ్‌కుమార్, పరుచూరి భాస్కరరావు, పీవీఎస్ఎన్ రాజు తెలిపారు. గురువారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ. ఈనెల 7న ఎలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించనున్నారన్నారు. ముందుగా అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి నాగబాబు భారీ ర్యాలీతో హరిపురం గ్రామం చేరుకుంటారన్నారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పాల్పడిన అవినీతిపై గళం విప్పనున్నారని తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారం చేపడుతుందని, ప్రజలందరినీ అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగబాబుకు స్వాగతం పలకాలని కోరారు. అలాగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.